Wednesday, 8 August 2012

ఎంపీగా మేకపాటి ప్రమాణం

ఇప్పుడు ఇద్దరమే.. మున్ముందు పెద్ద సమూహంగా మారతాం
8/9/2012 2:25:00 AM
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి 2.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే.. సభ్యులందరూ నిలబడి జాతీయ గీతాలాపన చేశారు. గీతాలాపన ముగిసిన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేపట్టారు.

మొదటగా నెల్లూరు స్థానం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన మేకపాటి పేరును పిలిచారు. ఆయన పోడియం ముందుకు వచ్చి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక మేకపాటి స్పీకర్ మీరాకుమార్‌కు అభివాదం చేసి సభ్యుల రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆ తర్వాత తనకు కేటాయించిన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మేకపాటి తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తరఫున కనౌజ్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన డింపుల్‌యాదవ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆమెతో స్పీకర్ కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

బలమైన శక్తిగా ఎదుగుతాం: మేకపాటి
ఉప ఎన్నికల్లో తన విజయం పూర్తిగా ప్రజల విజయమని ఎంపీ మేకపాటి అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మీద అభిమానాన్ని ఓటర్లు ఎన్నికల్లో చూపారని.. అందుకే తనకు ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం పార్లమెంటులో తమ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులం మాత్రమే ఉన్నామని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగి పెద్ద సమూహం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. నేడు జాతీయ పార్టీలుగా ఉన్న పార్టీలన్నీ మొదట ఒకరిద్దరు సభ్యులతోనే తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయని గుర్తు చేశారు. రానున్న కాలంలో తమ పార్టీ బలీయశక్తిగా ఎదుగుతుందని.. దాన్ని ఎవరూ నిలువరించలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన అనంతరం ఆయన పార్లమెంట్ బయట విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. గత నెల 30న నెల్లూరు సమీపంలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ‘ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి?’ అని ప్రశ్నించగా.. 2014 నాటికి చాలామంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, తర్వాత వస్తే స్క్రూటినీ చేసి పార్టీలోకి తీసుకుంటామని మేకపాటి బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని.. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆత్రుత తమకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా?’ అని ప్రశ్నించగా.. ‘‘మాకు దగ్గర కావాలని కాంగ్రెస్ ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు’’ అని బదులిచ్చారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి లౌకిక శక్తులతో మాత్రమే కలుస్తామని జగన్ ఎప్పుడో చెప్పారని.. అదే మాటపై ఉంటారని తామంతా గట్టిగా నమ్ముతున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

No comments:

Post a Comment